" ఈశా అంటే సృష్టికి మూలమైనదేదో అది అని అర్థం. క్రియ అంటే ఆ దిశగా జరిపే అంతర్గత చర్య. ఈశా క్రియ చాలా సులువైన ప్రక్రియ, కాని అసత్యం నుంచి సత్యానికి సాగడానికి ఇది ఒక శక్తివంతమైన సాధనం"

- సద్గురు

శ్రేయస్సు చేకూర్చే సాంకేతిక విజ్ఞానం

తరచుగా అడిగే ప్రశ్నలు:

 • ఈ ధ్యానం వల్ల ప్రయోజనం ఏమిటి?
 • ఈ ధ్యానం అసలేం చేస్తుంది?
 • ఈశా క్రియ చేయడానికి కనీస వయస్సు ఎంత ?
 • దీన్ని ఆన్‌లైన్‌లో ఎందుకు అందిస్తున్నారు?
 • శ్వాస యొక్క ప్రాధాన్యత ఏమిటి? శ్వాస సరిగ్గా తీసుకోవడంలో ఆరోగ్యంగా ఉండడం కంటే ఇంకా ఏమైనా విశిష్టత ఉందా?
 • క్రియ చేసేటప్పుడు ఎందుకు తల కొంచెం పైకెత్తి పెట్టాలి ?
 • ’ఆఁ...’ శబ్ధాన్ని ఉచ్చరించటం వలన నాపై ఎలాంటి ప్రభావం ఉంటుంది?
 • ఈశాక్రియను ఖాళీ కడుపుతోనే చేయాలా? భోజనానికి, ఈ క్రియ చేయడానికి మధ్య ఎంత సమయం ఉండాలి?
 • ఈ ధ్యానం ఏదో కొంత కాలం చేయాలా లేక జీవితాంతం ప్రతిరోజూ చేయాలా?
 • నేను ఇదివరకే ఇన్నర్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ చేశాను, సాధన కూడా ప్రతిరోజూ చేస్తున్నాను. శాంభవీ మహాముద్రతో పాటు ఈశా క్రియ కూడా చేయాలా? రెండూ చేస్తే ప్రయోజనకరంగా ఉంటుందా?
 • ‘ఆఁ’ శబ్ధాన్ని పలికిన తరువాత నాకెంతో బాగా, హుషారుగా ఉన్నట్లనిపిస్తుంది. ఈ మంత్రాన్ని ఏడు కంటే ఎక్కువసార్లు ఉచ్చరించవచ్చా లేక దీనిని వేరే ధ్యానంగా చేయమంటారా?
 • అందరూ ఈశాక్రియ చేయవచ్చా? లేక ఏదైనా వ్యాధితో ఉన్నప్పుడు చేయకూడదా? నాకు సర్వైకల్ స్పాండిలోసిస్ ఉన్నది, మరి నాకు ఈశాక్రియ సాధన చేయడం క్షేమమేనా?
 • నేను ఈ ధ్యానం మా ఇంట్లో వాళ్ళకు, స్నేహితులకూ నేర్పవచ్చా లేక వాళ్ళు కూడా వీడియో చూసే నేర్చుకోవాలా?
 • నేను ‘ఆఁ’ శబ్దాన్ని పలికినప్పుడు, నాకు గొంతు, హృదయ చక్రాల దగ్గర వైబ్రేషన్ తెలుస్తోంది కాని మణిపూరక చక్రం(నాభి) దగ్గర తెలియడం లేదు. నేనేమైనా తప్పు చేస్తున్నానా?
 • నేను క్రింద బాసీ పీట వేసుకుని కూర్చోలేను. కాబట్టి కుర్చీలో నిటారుగా కూర్చుని ఈశాక్రియ చేయవచ్చా?
 • ఈ ధ్యానం ఎక్కడ చేయాలి? నేను ఉండే ప్రాంతమంతా రణగొణ ధ్వనులతో ఉంటుంది. ఈ సాధనకు నాకు ప్రత్యేకమైన స్థలం కావాలా?
 • నేను ఇదివరకే ఆన్‌లైన్‌లో ఈశాక్రియ నేర్చుకున్నాను, సక్రమంగా సాధన చేసేవాడిని కూడా, కాని మధ్యలో ఏదో కారణం వల్ల మానేయడం జరిగింది. నాకు మళ్ళీ మొదలు పెట్టాలని ఉంది. నేను మళ్ళీ ఆన్‌లైన్ క్లాసు చేయాలా లేక నేను ముందు నేర్చకున్నదాన్నే కొనసాగించవచ్చా?
 • ఈశా క్రియ చేయడానికి సరైన సమయమేది?
 • ఈశా క్రియను రోజులో ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేయవచ్చు?
 • ఈ ధ్యానం 48 రోజులు ఎందుకు చేయాలి?

మీ ప్రశ్నలు ఇక్కడ వ్రాయండి

 • సద్గురు: ప్రప్రథమంగా అసలు ధ్యానం చెయ్యాల్సిన అవసరం ఏమిటి? ఈ జీవితం అన్నది మీరు తెలిసి ఎంచుకున్నది కాదు, అది మీకు "సంభవించింది". పుట్టినప్పుడు మీ శరీరం చాలా చిన్నది, ఇప్పుడిలా పెరిగి పెద్దదైంది. అంటే ఖచ్చితంగా ఈ శరీరం’ మీరు సేకరించుకున్నదే. దేన్నైతే మీరు "నా శరీరం" అంటారో, అది మీరు తిన్న ఆహార సేకరణ. అలాగే దేన్నైతే మీరు "నా మనస్సు" అంటారో అది భావాల సేకరణ.

  మీరు సేకరించుకున్నది మీది కావచ్చు, కానీ అది ఎన్నటికీ మీరు కాలేదు. మీరు దాన్ని పోగుచేసుకున్నారంటేనే మీరు దాన్ని ఎక్కడ నుంచో సేకరించుకున్నారని అర్థం. ఈ రోజు మీది ఓ 70 కేజీల శరీరం, రేపు దాన్ని మీరు 60 కేజీల శరీరంగా మార్చాలనుకోవచ్చు. ఆ 10 కేజీలు ఎక్కడకి పోయాయా అని మీరు వెతుకుతూ వెళ్ళరు, ఎందుకంటే అది పోగుచేసుకున్నది. ఒకసారి దాన్ని వదులుకుంటే, అది ఇక పోయినట్లే.

  అలాగే మీ మనసు కూడా భావాల సేకరణ మాత్రమే.

  ఎప్పుడైతే మీరు, మీ అనుభవాన్నే మీరనుకుంటారో, మీరు కానిదానితో మిమ్మల్ని మీరు గుర్తించుకుంటారో, అప్పుడు మీ గ్రహణశీలత పూర్తిగా వక్రీకరింపబడుతుంది. మీరు బైటనుంచి సేకరించుకున్న శరీరాన్ని మీరుగా భావించిన క్షణం, మీ మనస్సుపై పడిన ముద్రలను మీరుగా భావించిన క్షణం, జీవితాన్ని ఉన్నదున్నట్టుగా చూడలేరు. మీ మనుగడకి ఏవిధంగా ఐతే అవసరమో, ఆవిధంగానే జీవితాన్ని చూస్తారు తప్ప, అది నిజంగా ఎలా ఉందో అలా చూడలేరు.

  మనిషిగా ఈ లోకంలోకి ఒకసారి రావడమంటూ జరిగాక, మనుగడ అనేది చాలా ముఖ్యమైనదే, కానీ కేవలం అదే సరిపోదు. మీరు ఇంకేదయినా ప్రాణిగా ఈ భూమ్మీదకి వచ్చి ఉంటే, కడుపు నిండితే చాలు జీవితం గడిచిపోతుంది. కానీ ఒకసారి మనిషిగా వచ్చిన తర్వాత, మనుగడతోనే జీవితం ముగిసిపోదు. నిజానికి మనిషికి కడుపు నిండినపుడే జీవితం మొదలౌతుంది.

  కాబట్టి ధ్యానం మీకొక అనుభవాన్నీ, అంతర్గత స్థితినీ ఇస్తుంది. ఆ స్థితిలో "మీరు”, "మీది" అనేవి వేరుగా ఉంటాయి. మీకూ, మీరు పోగుచేసుకున్న వాటికీ మధ్య కొంత దూరం, కొంచెం ఖాళీ ఏర్పడతాయి. ప్రస్తుతానికి దీనిని ధ్యానంగా అర్థం చేసుకుందాం.

 • సద్గురు: ఈ క్రియ, మీకూ మీ శరీరానికీ, అలానే మీకూ మీ మనస్సుకూ మధ్య కొంత దూరాన్ని ఏర్పరుస్తుంది. మీ జీవితంలో ఏదైనా సంఘర్షణ ఉందంటే, దానికి కారణం ఈ పరిమితమైన వాటితో మిమ్మల్ని మీరు గుర్తించుకోవడమే.

  కాబట్టి ధ్యానం యొక్క సారం ఏమిటంటే అది మీకూ, మీరు ’మనస్సు’ అనే దానికీ మధ్య కొంత దూరాన్ని ఏర్పరుస్తుంది. మీరు పడే బాధంతా మీ మనస్సులోనే తయారు చేయబడింది. మీ మనస్సు నుంచి మీరు దూరంగా జరిగితే, మీలో బాధ ఉంటుందా? ఇదే బాధకు అంతం. మీరు ధ్యానం చేస్తున్నప్పుడు, మీకూ మీ మనస్సుకూ మధ్య దూరం ఏర్పడి, మీకు ప్రశాంతంగా అనిపిస్తుంది. కాని సమస్య ఏమిటంటే మీరు కళ్ళు తెరిచిన మరుక్షణం నుండీ మళ్ళీ మీరు మీ మనసులో కూరుకుపోతారు. మీరు ప్రతి రోజూ ధ్యానం చేస్తే, ఒక రోజుకి, కళ్ళు తెరిచి ఉన్నా కూడా "మీరు ఇక్కడ, మీ మనసు అక్కడ" అన్న విషయం మీకు అనుభవంలోకి వస్తుంది. ఇక ఇదే బాధకు అంతం.

  మీ శరీరంతో, మీ మనస్సుతో మిమ్మల్ని మీరు ఇక ఏమాత్రం గుర్తించుకోనప్పుడు, మీలోని సృష్టి మూలాన్ని మీరు తాకుతారు. ఇది జరిగినప్పుడు, అనుగ్రహం కలుగుతుంది. అంటే మీ మొత్తం కర్మ అంటే మీ గతం లేక మీ అచేతన మనస్సు ప్రక్కన పెట్టబడిందన్నమాట. అది ఇక మీపై ఎటువంటి ప్రభావం చూపలేదు, దాంతో జీవితం ఒక పెద్ద అవకాశం అవుతుంది.

  మీ జీవితంలోని ప్రతిశ్వాసా ఒక అద్భుత అవకాశంగా మారుతుంది, ఎందుకంటే గతానికి ఇప్పుడు మీ ఉనికిలో ఏ పాత్రా లేదు. అప్పుడు మీరు ఎక్కడ కూర్చున్నా, ఒక పరిపూర్ణ జీవే! జీవితం సునాయాసం అవుతుంది.

 • పన్నెండు సంవత్సరాల వయస్సు దాటిన వారెవరైనా ఈశా క్రియ సాధన చేయవచ్చు.

 • సద్గురు: కొద్ది సంవత్సరాల క్రితం, ఏ ప్రయత్నం లేకుండానే, ఏ కారణం లేకుండానే, ఊరికనే అలా కూర్చుని పారవశ్యంతో ఉప్పొంగిపోయాను. అప్పుడు నేను "ఇదేం పెద్ద విషయం? నేనిక్కడ ఊరికే కూర్చుంటేనే, నాలో పారవశ్యం ఉప్పొంగిపోతుంది. ఇందులో పెద్ద గొప్పేముంది? నేను ప్రపంచాన్నంతా పారవశ్యంలో ముంచేస్తాను" అని అనుకున్నాను. ఇప్పటికి దాదాపు ముఫ్ఫై ఏళ్ళు అయింది, నేనేమో ఇలా ఐపోయాను (తన గడ్డం చూపుతూ), కాని మనుషులు మాత్రం తమ దుఃఖాన్ని వీడలేదు. మేము కొన్ని లక్షల మందిని చేరాము, కాని అదే మొత్తం ప్రపంచం కాదు. నా ఉద్దేశ్యంలో ప్రపంచమంటే 700 కోట్ల మంది.

  ప్రస్తుతం సమాజాలు రోజురోజుకూ వికృతంగా తయారవుతున్నాయి. ఎందుకంటే భౌతికంగా చేయగలిగినదంతా చేసేశాము. ఇప్పుడు ఇక ఏం చేయాలో తెలీదు. మీరు చేయగలిగిదంతా జుట్టు కత్తిరించుకోవడం లేదా వళ్ళంతా పచ్చబొట్లు పొడిపించుకోవడమే. దాన్ని మించి మీరు ఇంకా కొత్తగా చేయగలగినదేముంది? ఏదో ఒకటి కొత్తది చేయాలన్న తపనతో, మనుషులు మరిన్ని వికృతపు పనులు చేయడం మొదలుపెడతారు.

  అయితే ఆధ్యాత్మిక ప్రక్రియలను అందుకోటానికి ఇప్పుడు సమాజం మంచి పరిపక్వతతో ఉంది. దాన్ని ఇప్పుడు అందించకపోతే, అది బద్ధలౌతుంది. మీరిప్పుడు ఏ మతానికీ లేదా సిద్ధాంతాలకు చెందని, అంతర్ముఖులను చేసే, ఒక సులువైన ఆధ్యాత్మిక ప్రక్రియను పెద్ద ఎత్తున అందించాలి. అది ఇప్పటిదాకా, అక్కడక్కడా కొంతమందికి చేరింది, కాని పెద్ద ఎత్తున జరగలేదు. ఈ రోజు మనకు అందుబాటులో ఉన్న సాంకేతిక పరిఙ్ఞానంతో (టెక్నాలజీతో), మనం దీనిని సాధించగలము.

  మానవ చైతన్యానికి పెద్ద ఎత్తున ఏదో చేశామన్నగౌరవం పొందటానికి ఈ తరానికి చెందిన మనుష్యులుగా మనం చేయగలగిన అతి ముఖ్యమైన పని ఇది. మనం బయట ఇంకా ఎక్కువ ఇంజనీరింగ్ చేస్తే, మనకిక ఈ భూగోళమే మిగలదు. మానవవులు తమ శక్తిని అంతర్ముఖం చేసుకొని, బయట ప్రపంచంలో నష్టం కలిగించడం ఆపేసి, తమను తామే సరిదిద్దుకునే సమయం ఆసన్నమైంది. చేయటానికి లోపల చాలా పని ఉంది. బయటి ప్రపంచంలో ఉత్సాహంగా బాగా శ్రమపడే వారికి ఈ ధృక్కోణాన్ని మనం పెద్ద ఎత్తున అందించక పోతే, వారి శ్రమే ఈ భూగోళాన్ని నాశనం చేస్తుంది.

 • సద్గురు: మీ శ్వాసే మిమ్మల్ని శరీరానికి కట్టి ఉంచే సూత్రం. మీ శ్వాసని నేను తీసేస్తే, మీ శరీరం మీ నుండి విడిపోతుంది. శ్వాసే మిమ్మల్ని శరీరంతో కట్టి ఉంచింది. మీరు దేన్నైతే ’శరీరం’ అంటారో, దేన్నైతే ’నేను’ అంటారో, ఆ రెండూ శ్వాసతో బంధించబడ్డాయి. ఈ శ్వాస మీ ప్రస్తుత వ్యక్తిత్వంలోని అనేక అంశాలను నిర్ణయిస్తుంది.

  మీలో జరిగే ఆలోచన, భావోద్వేగాల స్థాయిలకు అనుగుణంగా, మీ శ్వాసగతులు మారుతుంటాయి. మీరు కోపంగా ఉన్నప్పుడు ఒకలా శ్వాస తీసుకుంటారు. ప్రశాంతంగా ఉన్నప్పుడు మరోలా శ్వాస తీసుకుంటారు. ఆనందంలో ఉన్నప్పుడు ఒకలా శ్వాస తీసుకుంటారు, దుఃఖంలో ఉన్నప్పుడు ఇంకోలా శ్వాస తీసుకుంటారు. ఇది మీరు గమనించారా? దీనిని దృష్టిలో పెట్టుకునే ప్రాణాయామం, క్రియలకు సంబంధించిన శాస్త్రం ఆవిర్భవించింది. ఒక విధమైన పద్ధతిలో, కావాలనే శ్వాస తీసుకోవటం వలన మీరు ఆలోచించే విధానంలో, అనుభూతిలో, జీవితాన్ని అర్ధం చేసుకుని అనుభవించే విధానంలో మార్పు తీసుకురావచ్చు.

  మీ శరీరంతో, మనస్సుతో వేరే ఇతర పనులను చేయడానికి, ఈ శ్వాసని ఎన్నో రకాలుగా ఒక సాధనంగా ఉపయోగించుకోవచ్చు. ఈ ’ఈశాక్రియ’ లో ఒక సులభమైన శ్వాస ప్రక్రియని వాడుతున్నాము, కాని క్రియ అన్నది శ్వాసలో లేదు. శ్వాస అనేది ఒక పరికరం మాత్రమే. శ్వాస అనేది ప్రేరణ మాత్రమే, క్రియలో ఏం జరుగుతుంది అనేది మాత్రం శ్వాసకి సంబంధించినది కాదు. మీరు ఏ విధంగా శ్వాస తీసుకుంటారో, అదే విధంగా ఆలోచిస్తారు. మీరు ఏ విధంగా ఆలోచిస్తారో అదే విధంగా శ్వాస తీసుకుంటారు. మీ జీవితం, మీ అచేతనా మనస్సు అంతా మీ శ్వాసలో రాసి పెట్టి ఉంటుంది. మీ శ్వాసని మీరు చదవగలిగితే, మీ గతం, వర్తమానం, భవిష్యత్తు అంతా కూడా మీరు శ్వాస తీసుకునే విధానంలో రాసిపెట్టి ఉంటుంది.

  దీనిని మీరు గ్రహిస్తే, మీ జీవితం చాలా భిన్నంగా ఉంటుంది. ఇది అనుభవపూర్వకంగా తెలుసుకోవలసినది, దీనిని మీరు ప్రతిపాదించలేరు. ఏమీ చేయకుండా, ఏమీ ఆలోచించకుండా కేవలం ఒక జీవంలా మీరు ఇక్కడ కూర్చోగలిగితే, అలా కూర్చోవడంలోని పరమానందం మీకు తెలిస్తే, జీవితం చాలా భిన్నంగా ఉంటుంది.

  ఒక విధంగా దీని అర్ధం ఏమిటంటే ఒక చుక్క మద్యం కూడా సేవించకుండా, ఏ మాదక పదార్థం తీసుకోకుండా, ఊరికే ఇక్కడ కూర్చొని మీ అంతట మీరు ఉన్న్మత్తులు కాగలరు. దీనికి ఇప్పుడు శాస్త్ర పరమైన ఋజువులున్నాయి. మీలో ఒకరకమైన స్పృహ ఉంటే, ఊరికే కూర్చుని అపారమైన ఆనందాన్ని పొందేలా మీ శారీరక వ్యవస్థని చైతన్య పరచవచ్చు. ఎప్పుడైతే ఊరికే కూర్చొని శ్వాస తీసుకోవటమే ఒక గొప్ప ఆనందం అవుతుందో, అప్పుడు మీరు చాలా ఉల్లాసమైన, అద్భుతమైన వ్యకిగా మారతారు. ఎందుకంటే, నిత్యం మీలో మీరు ఒక గొప్ప స్థితిలో ఉంటారు. పూర్వం కంటే మనసు మరింత చురుకుగా తయారవుతుంది.

 • సద్గురు: తల కొంచెం పైకెత్తి కూర్చునేది ఆకాశంలో తేలేదేదో చూడడానికో లేక ఏదో ఊహించుకోవడానికో కాదు! పైకి చూస్తున్నప్పుడు మీ శరీర వ్యవస్థకు గ్రహింపు శక్తి పెరుగుతుంది. అది ఒక కిటికీ తెరవడం లాంటిది. అంటే ఇది అనుగ్రహానికి పాత్రులవడం అన్నమాట. మీరు ఇష్టపడి స్వీకరించడానికి సిద్ధపడినప్పుడు, మీ శరీరం సహజంగానే పైవైపుకి తిరుగుతుంది.

 • సద్గురు: మీరు ’ ఆఁ...’ శబ్దాన్ని ఉచ్చరించినప్పుడు మీ శరీరంలోని నిర్వహణాకేంద్రం ఉత్తేజితమవుతుంది. ఇదే మణిపూరక చక్రం లేదా నాభీ కేంద్రం. ఈ మణిపూరకం మీ నాభికి సుమారు ముప్పావు అంగుళం క్రింద ఉంటుంది. మీరు మీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు, ఈ స్థానంవద్దనే నిర్వహణానాళం మీ శరీరంతో కలిసి ఉంటుంది. ఇప్పుడు ఆ నాళం లేదనుకోండి, కాని నిర్వహణాకేంద్రం మాత్రం మీ నాభిలోనే ఉంటుంది.

  భౌతిక శరీరంలాగానే ఒక శక్తి శరీరం కూడా ఉంటుంది. ఈ శక్తినే మనం ప్రాణం అని కూడా అంటాము. ఈ శక్తి మన శరీరంలో కొన్ని నిర్దేశిత పద్ధతులలో మాత్రమే ప్రవహిస్తుంది, ఎలా పడితే అలా కదలదు. దాని చలనానికి 72000 వేర్వేరు మార్గాలున్నాయి. ఇంకొక విధంగా చెప్పాలంటే శరీరంలో 72000 మార్గాల ద్వారా ఈ శక్తి ప్రవహిస్తుంది. కాబట్టి నాడులనేవి శరీరంలో శక్తి ప్రవహించే మార్గాలు లేదా దారులు. వీటికి భౌతికపరమైన రూపం ఏమీ ఉండదు. మన శరీరాన్ని కోసి చూస్తే ఈ నాడులు కనపడవు. కానీ మీలో ఎరుక(awareness) పెరుగుతున్న కొద్దీ, ఈ శక్తి, ఎలా పడితే అలా కాక, కొన్ని నిర్దేశిత మార్గాలలోనే ప్రవహించటం మీరు గమనించగలుగుతారు.

  కేవలం ’ ఆఁ...’ శబ్దం ఒక్కటే శరీరం అంతా వ్యాపించగలదు, ఎందుకంటే కేవలం మణిపూరక చక్రం వద్ద మాత్రమే 72000 నాడులు వాటంతటవే కలిసి మళ్లీ శరీరమంతటికీ మళ్ళీ పంపిణీ అవుతాయి . మీరు ’ ఆఁ...’ శబ్ధాన్ని ఉచ్చరించినప్పుడు, ప్రకంపనలు నాభికి సుమారు ముప్పావు అంగుళం క్రింద మొదలయి శరీరం అంతా వ్యాపించడం మీరు చూస్తారు. ఈ ప్రకంపనలు మీ నిర్వహణ కేంద్రాన్ని శక్తివంతంగా తయారుచేయటానికి ఎంతో దోహదం చేయగలవు. ఈ కేంద్రాన్ని చైతన్యవంతం చేయడం వలన ఆరోగ్యము, చైతన్యము, సంపద మరియు శ్రేయస్సు కలుగుతాయి.

 • ఖాళీ కడుపుతో ఉండవలసిన అవసరం లేదు. భోజనం తరువాత విరామం అవసరం లేదు. కాని నిండు కడుపుతో చేస్తే నిద్రలోకి జారుకునే అవకాశం ఉంది.

 • ధ్యానమనేది మీరు చేసే అనేక కార్యకలాపాల లాగా మీ జీవితంలో ఒక భాగమైపోవచ్చు. ఇది మీరు ఉదయం పళ్ళు తోముకునే విధంగానే - మొదట్లో మీరు ఖచ్చితంగా చేయాలని ఎవరో పట్టుబట్టి చేయించారు- కాని ఒకసారి దాని విలువ తెలిశాక అప్పుడిక అది మీ జీవితంలో ఒక భాగమైపోయింది. ధ్యానంతో కూడా అంతే - ఒకసారి దాని విలువ మీకు తెలిసాక, ఎటువంటి శ్రమ లేకుండానే అది మీ రోజూవారి జీవితంలో ఒక భాగమైపోతుంది. అయితే ఇది జరగడానికి మొదట్లో కొంత పట్టుదల కావాలి. మొదటి 48 రోజులపాటు ఈ సాధనను రోజుకు రెండుసార్లు చేయాలని నిర్ణయించడానికి ఇదొక కారణం.

 • మీరు ఈ రెండు సాధనలను ప్రతిరోజూ చేయగలిగితే మంచిది. వాటి వల్ల మీరు ఖచ్చితంగా ప్రయోజనం పొందుతారు. కాని మీకు సమయం సరిపోనట్లైతే, శాంభవీ మహాముద్రకు ప్రాధాన్యత ఇవ్వడం ఉత్తమం.

 • మీకు కావాలనుకుంటే ఈశా క్రియనే మరికొన్ని సార్లు చేయండి. కాని మంత్రాన్ని ఎక్కువ సమయం చేయాలనుకుంటే మాత్రం ‘ఆ-ఉ-మ్(ఆమ్ కార)’ ఉచ్చారణ సరైనది. మీరు ఈశా ఆశ్రమానికి రాగలిగితే, అక్కడ ప్రతి రోజూ మధ్యాహ్నం 12.15 నుంచి 1.30 దాకా అందించే ‘ఆ-ఊ-మ్(ఆమ్ కార)’ ఉపదేశాన్ని మీరు తీసుకోవచ్చు. లేదంటే మీ దగ్గరలో జరిగే ఈశా యోగా లేదా ఇన్నర్ ఇంజనీరింగ్ ప్రోగ్రాంలో చేరి అక్కడ దీన్ని నేర్చుకోవచ్చు. మీ దగ్గరలో జరగబోతున్న ఈ కార్యక్రమ వివరాలకోసం www.ishayoga.org వెబ్ సైట్‌ను చూడండి.

 • సర్వైకల్ స్పాండిలోసిస్ ఉన్నప్పుడు ఈశాక్రియ చేయడంలో ఎటువంటి సమస్యా లేదు. మీకది ఉపయోగకరంగా ఉంటుంది. మీరు బాసీ పీట వేసుకుని క్రింద కూర్చోలేక పోతే, కుర్చీలోనో, బెంచి మీదో కూర్చొని చేయవచ్చు, కాకపోతే మడమల దగ్గర ఒక కాలిపై మరోకాలు ఉండేటట్టు చూసుకోండి. క్రియ చేస్తున్నంత సేపూ సౌకర్యవంతంగా కూర్చోగలిగినట్లయితే, మీకు ఏ విధమైన దీర్ఘకాల వ్యాధి ఉన్నా లేక శారీరిక ఋగ్మతలున్నా, ఈశాక్రియ చేయడంలో ఎటువంటి సమస్యా లేదు.

 • వీడియో చూసి తామంత తామే క్రియ నేర్చుకోవడం మంచిది.

 • మీరు మీ నోరును పూర్తిగా తెరుస్తున్నారో లేదో చూడండి. అలా పూర్తిగా తెరచి చేస్తే, మణిపూరకం వద్ద వైబ్రేషన్ ఖచ్చితంగా తెలుస్తుంది. మీకు తెలియకుండానే మీరు నోరును కొంత మూసి ఉంచుతుండవచ్చు. నోరు పూర్తిగా తెరచి తేడా గమనించగలరేమో చూడండి.

 • చేయవచ్చు, కుర్చీలో కూర్చున్నప్పుడు మడమల దగ్గర ఒక కాలుపై మరోకాలు ఉండేటట్లు చూసుకోండి.

 • మీరీ సాధనను ఎక్కడైనా చేయచ్చు, కాని ఈ క్రియ చేసేటప్పుడు శారీరికంగా మిమ్మల్నెవరూ కదిలించకుండా చూసుకోండి. నిశ్శబ్దంగా ఉండే ప్రదేశంలో చేయడం మంచిదే, కాని అటువంటి ప్రదేశంలోనే చేయాలనేం లేదు. మరే ఇతర ప్రత్యామ్నాయం లేకపోతే మీరున్నచోటే చేయవచ్చు. ముఖ్య మైన విషయమేమిటంటే, క్రియ మధ్యలో బ్రేక్ తీసుకోవద్దు, అలా చేస్తే సాధన సమయంలో జరిగే శక్తుల పునర్వ్యవస్థీకరణలో అంతరాయం కలుగుతుంది.

 • మీకు ఇంతకు ముందిచ్చిన సూచనలన్నీ గుర్తున్నట్లైతే, ముందు నేర్చుకున్నదాన్నే కొనసాగించవచ్చు. కాని మీకు సూచనలు గుర్తులేక పోతే మరోసారి నేర్చుకోవడం మంచిది.

 • మీకు అనుకూలంగా ఉండే ఏ సమయంలోనైనా చేయవచ్చు, కాని దయచేసి అర్ధరాత్రి సమయంలో చేయకండి.

 • ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి ప్రాక్టీస్ చేయడం ఉత్తమం. కాని మీ దగ్గర తగినంత సమయం ఉండి, మీరు మరింత తరచుగా ప్రాక్టీస్ చేయాలనుకున్నా చేయవచ్చు

 • సాధారణంగా 48 రోజులను ఒక మండలం అంటారు, ఈ సమయంలో శరీరవ్యవస్థ ఒక విధమైన సైకిల్‌ను పూర్తిచేస్తుంది. ఉదాహరణకు ఆయుర్వేదంలో మందులను సాధారణంగా 48 రోజులకొరకు ఇవ్వడానికి కారణం కూడా ఇదే. మీ వ్యవస్థ మీద మందుల ప్రభావం వేళ్ళూనడానికి ఇంత సమయం పడుతుంది. ఈశా క్రియకు కూడా అదే వర్తిస్తుంది, ఈ సమయంలో మీరు క్రియను మానేయకుండా చేయడం ముఖ్యం.

 
 
ISHA FOUNDATION
Isha Foundation - © 1997 - 2023 Isha Foundation. All Rights Reserved.
Site MapFeedbackContact UsInternational Yoga DayGuru Purnima 2019 View our Privacy Policy